కమలా నెహ్రూ ఆసుపత్రిలో సమస్యలపై మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆగ్రహం

కమలా నెహ్రూ ఆసుపత్రిలో సమస్యలపై మాజీఎమ్మెల్యే నోముల భగత్ ఆగ్రహం….

ప్రజాలహరి మిర్యాలగూడ;నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని కమలా నెహ్రూ ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ గురువారం ఆకస్మికంగా సందర్శించి రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు సమయపాలన పాటించడం లేదని, అత్యవసర సేవలకు అవసరమైన మందులు అందుబాటులో లేవని రోగులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా నోముల భగత్ ఆసుపత్రిలోని స్టాక్ రిజిస్టర్లు, ఇండెంట్ చేసిన మందుల వివరాలను పరిశీలించి, స్టోర్ రూమ్‌ను తనిఖీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో బాలింతలకు అందించిన కేసీఆర్ కిట్, నవజాత శిశువులకు అందించాల్సిన వ్యాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులో లేవని రోగులు తెలిపారు. అలాగే అత్యవసర సమయాల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని ఆరోపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నోముల భగత్, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలను ప్రారంభించడానికే పరిమితమైందని విమర్శించారు.వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని హంగు, ఆర్భాటాలకు ఖర్చు చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వినియోగించాలని సూచించారు.గతంలో అమలు చేసిన కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలను పేరు మార్చి అయినా కొనసాగించాలని, పేదలకు ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. కమలా నెహ్రూ ఆసుపత్రి చైర్మన్‌గా ఉన్న స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.ఇదే పరిస్థితి కొనసాగితే పేదల తరఫున సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించేందుకు కూడా వెనుకాడబోమని నోముల భగత్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో చెన్ను సుందర్ రెడ్డి, హీరేకార్ రమేష్ జీ, లక్మాల మధుబాబు, సయ్యద్ మక్సూద్, మహమ్మద్ గని, కోడా విజయ్, యాల విజయ్, ఆదాసు విక్రమ్, బండారు లక్ష్మీనారాయణ, జిలాని, కోడా కోదండ, నజీర్, మంద శాంతకుమారి, రఫీ, లక్ష్మణ్ నాయక్, అర్జున్ నాయక్, మహేష్ నాయక్, ధారా రవి, బహదూర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed