మిర్యాలగూడ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలి.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి:ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి
మిర్యాలగూడ నియోజకవర్గాన్ని రాబోయే రెండేళ్లలో అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ధీమా వ్యక్తం చేశారు.నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన సరదాగా చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలపై విలేకరులతో సుదీర్ఘంగా చర్చించి, వాటి పరిష్కారానికి సూచనలు అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని, అప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తోందని తెలిపారు.
నాకు రాజకీయాలు తెలియవు.. కేవలం ప్రజలకు సేవ చేయడం మాత్రమే తెలుసు అని ఆయన స్పష్టం చేశారు.అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మిర్యాలగూడ తీవ్ర అన్యాయానికి గురైందని, అప్పట్లో అక్రమాలు, దౌర్జన్యాలు, నిర్బంధాలు రాజ్యమేలేవని విమర్శించారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని, ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని చెప్పారు.
మిర్యాలగూడ సర్వతోముఖాభివృద్ధికి మీడియా ప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.నియోజకవర్గంలో ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటిని నేరుగా తన దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
రాబోయే రెండు సంవత్సరాల కాలాన్ని మిర్యాలగూడ రూపురేఖలు మార్చడానికి ఉపయోగించుకుంటామని,మౌలిక సదుపాయాల కల్పనలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.


