హైపవర్ కమిటీ పారదర్శకంగా పని చేయాలి: ఉద్యమకారుడు అన్నెబోయిన మట్టయ్య
హైపవర్ కమిటీ పారదర్శకంగా పని చేయాలి: ఉద్యమకారుడు అన్నెబోయిన మట్టయ్య
ప్రజాలహరి మిర్యాలగూడ: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు హైపవర్ కమిటీ పారదర్శకంగా పని చేయాలని నల్లగొండ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, టీయూడబ్ల్యూజే (హెచ్-143) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అన్నెబోయిన మట్టయ్య కోరారు. హైదరాబాద్ లోని తెలంగాణ అమర జ్యోతి ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, హైపవర్ కమిటీ చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ కె. కేశవరావును మంగళవారం కలుసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, యువకులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, డాక్టర్లు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు, రాజకీయ జేఏసీ, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, సబ్బండ కులాలు, సబ్బండ వర్ణాలు, సకల జనులు వివిధ స్థాయిలలో ఉద్యమాలు చేసారని పేర్కొన్నారు. ఆరు దశాబ్ధాల కల సాకారం చేసుకోవడానికి ఎందరో ప్రాణ త్యాగం, ఆత్మ బలిదానాలు చేసారని, కొందరు తీవ్ర గాయాలపాలై అచేతన స్థితిలో పడి ఉన్నారని, కేసులు – జైళ్ళ పాలయ్యారని, ముఖ్యంగా విద్యార్థి యువత మంచి భవిష్యత్తును కోల్పోయారని వివరించారు. సమీక్షా సమావేశాల అనంతరం నివేదికలు తయారు చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసి, విధి విధానాలను రూపొందించి, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.



