ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై ఉక్కు పాదం మోపుతాం జిల్లా ఇంచార్జ్ డీఎస్పి జీ రవి
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్ ( హరి ప్రసాద్ చీదళ్ళ);నేరాలకు దూరంగా ఉండాలి – చట్టాన్ని గౌరవించి ప్రశాంత జీవనం సాగించాలి. ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతాం: రౌడీ షీటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన మిర్యాలగూడ ఇంచార్జ్ డీఎస్పీ జి. రవి నల్గొండ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ లో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ సబ్‌డివిజన్ పరిధిలో, ఇంచార్జ్ డీఎస్పీ జి. రవి రౌడీ షీటర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ రూరల్ సీఐ పి.ఎన్.డి ప్రసాద్, మిర్యాలగూడ వన్ టౌన్, సీఐ నాగభూషణ్,టూ టౌన్ సీఐ సోమ నర్సయ్య,మరియు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ లక్ష్మయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ డీఎస్పీ జి. రవి మాట్లాడుతూ, “రౌడీయిజం, బెదిరింపులు, దౌర్జన్యాలు, అక్రమ వసూళ్లు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఇకపై నేరాలకు పాల్పడే ప్రతి ఒక్కరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే నిర్బంధ చర్యలు కూడా చేపడతాం” అని స్పష్టం చేశారు. రౌడీ షీటర్లు తమ నివాసం మార్చినా, పోలీస్ స్టేషన్ పరిధి దాటి ఇతర ప్రాంతాల్లో నివసించాలన్నా ముందస్తుగా సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసుల పిలుపు మేరకు విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని, కోర్టు విధించిన బెయిల్ షరతులను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం, బాధితులు లేదా సాక్షులను బెదిరించడం, గొడవలు సృష్టించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త నేరాల్లో ప్రమేయం ఉన్నట్లు తేలితే రౌడీ షీట్ కొనసాగించడంతో పాటు ఇతర నివారణ చర్యలు కూడా అమలు చేస్తామని తెలిపారు. అలాగే “రౌడీ షీట్ శిక్ష కాదు. నేరాలను నిరోధించేందుకు, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు తీసుకునే ముందస్తు చర్య. అయితే పర్యవేక్షణలో ఉన్న వ్యక్తులు మళ్లీ నేరాలకు పాల్పడితే చట్టం తన పని తాను చేస్తుంది., ఎవరినీ విడిచిపెట్టేది లేదు” అని హెచ్చరించారు.ఎవరైనా తమ ప్రవర్తనలో నిజమైన మార్పు తీసుకువచ్చి, నిర్దేశిత కాలం పాటు ఎలాంటి నేర కార్యకలాపాలకు పాల్పడకుండా ఉంటే, సంబంధిత నిబంధనల ప్రకారం వారి రౌడీ షీట్ మూసివేతను సమర్థ అధికారి పరిశీలించే అవకాశం ఉంటుందని తెలిపారు. సమాజంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని, సత్ప్రవర్తనతో జీవించాలని అన్నారు.ఈ అవగాహన కార్యక్రమం ద్వారా రౌడీ షీటర్లలో చట్టంపై అవగాహన పెంపొందించడంతో పాటు, నేరాలకు దూరంగా ఉండి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించేలా ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.



