మిర్యాలగూడ ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: అమృత్ 2.0 పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

ప్రజాలహరి – మిర్యాలగూడ (హరిప్రసాద్ చీదళ్ళ ): మిర్యాలగూడ పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి, ప్రతి ఇంటికి 24 గంటల పాటు నాణ్యమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపడుతున్న అమృత్ స్కీమ్ 2.0 పనులను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ పరిశీలనలో DCC ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపాటి నవీన్ కుమార్, SC వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెద్ద దేవులపల్లి వద్ద అమృత్ 2.0 పథకం కింద నిర్మిస్తున్న నూతన పంప్ హౌస్ మరియు నూతన పైప్‌లైన్ నిర్మాణ పనులను పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించి, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో పాటు నిర్ణీత గడువులోపు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం మిర్యాలగూడ పట్టణంలో వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న 12 నూతన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి, పట్టణ ప్రజలకు నిరంతరాయంగా 24 గంటల తాగునీటి సరఫరా అందేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మిర్యాలగూడ పట్టణంలో తాగునీటి సమస్య గతంలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అమృత్ 2.0 పథకం పూర్తయిన అనంతరం పట్టణ ప్రజలకు నాణ్యమైన, నిరంతర తాగునీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed