“పాటతో ఒక పూట” పోస్టర్ ఆవిష్కరణ – ఆగస్టు 14న సామాజిక చైతన్య, దేశభక్తి సాంస్కృతిక వేడుకలు

ప్రజాలహరి మిర్యాలగూడ;కళలను, కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో “పాటతో ఒక పూట” పేరుతో సామాజిక చైతన్య, దేశభక్తి గీతాలు, సంగీతం, సాహిత్యం, నృత్య రూపకాలతో కూడిన వైభవోపేత సాంస్కృతిక కార్యక్రమాన్ని ఆగస్టు 14, 2026న నిర్వహిస్తున్నట్లు ప్రముఖ సామాజికవేత్త జాడి రాజు తెలిపారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం మిర్యాలగూడలోని షెడ్యూల్డ్ కులముల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో దాగి ఉన్న ప్రతిభావంతులైన కళాకారులను వెలికితీసి, వారికి తగిన గుర్తింపు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించే పోటీల్లో దేశభక్తి గీతాలు, సామాజిక చైతన్య గీతాలు, సంగీత ప్రదర్శనలు, నృత్య రూపకాలు మరియు ఇతర సాంస్కృతిక కళారూపాలు ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి గాయకులు, కళాకారులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు.

పోటీల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులను గుర్తించి ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు.

ఆగస్టు 14న మిర్యాలగూడలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ భవన్ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ సామాజిక సంఘాల నాయకులు, ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు.

పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్, తెలంగాణ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు నకిరేకంటి కిరణ్ కుమార్, జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాలోతు దశరథ్ నాయక్, బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి దుర్గయ్య, సామాజికవేత్త మహమ్మద్, బీసీ జేఏసీ కో-కన్వీనర్ దాసరాజు జయరాజు,సోమ ఆంజనేయులు,కాకునూరి రవి, జగదీశ్వర్ రెడ్డి, వట్టికోట శ్రీను వెన్నెల, నక్క నాగరాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed