ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోక్‌పిట్స్ నిర్మించాలి – హాలియా మున్సిపల్ కమిషనర్ కె. రవీందర్ రెడ్డి.

ప్రజాలహరి హాలియా;పురపాలక సంఘం హాలియా ఆధ్వర్యంలో జల సంచయ్ జన భాగిదారి (JSJB 3.0) – క్యాచ్ ది రైన్ కార్యక్రమంలో భాగంగా హాలియా మున్సిపల్ కమిషనర్ శ్రీ కె. రవీందర్ రెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల యాజమాన్యాలతో సమావేశమై ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు (Rainwater Harvesting Pits) మరియు కమ్యూనిటీ సోక్‌పిట్స్ నిర్మించాలని సూచించారు.

వర్షపు నీటిని వృథా కాకుండా భూగర్భ జలాల్లోకి ఇంకే విధంగా శాస్త్రీయ పద్ధతుల్లో వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని, నీటి వనరులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని కమిషనర్ పేర్కొన్నారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు పాఠశాలలు ముందుండాలని, రానున్న భావితరాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ప్రతి విద్యాసంస్థలో రైన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. హాలియా మున్సిపాలిటీని ఆదర్శవంతమైన, పర్యావరణ హిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో ప్రతి పాఠశాల యాజమాన్యం చురుకైన పాత్ర పోషించాలని, ఇంకుడు గుంతల నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని సూచించారు. ఈ సందర్భంగా టైం స్కూల్, శ్రీ శ్లోక స్కూల్, హాలియా పబ్లిక్ స్కూల్, ఆకాంక్ష స్కూల్, కృష్ణవేణి స్కూల్, లక్ష్య స్కూల్ యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశమై త్వరితగతిన ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోక్‌పిట్స్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ సీనియర్ అసిస్టెంట్ శ్రీ కె. సైదులు , పర్యావరణ ఇంజనీర్ శ్రీ రవి కుమార్ పాల్గొన్నారు.

You May Have Missed