అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి చెత్త రహిత మిర్యాలగూడ తీర్చిదిద్దాలి.. కలెక్టర్ చంద్రశేఖర్
మిర్యాలగూడ ప్రజాలహరి
గాంధీ జయంతి నాటికి మిర్యాలగూడ మున్సిపాలిటీని చెత్తరహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఆయన నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మున్సిపల్ సమావేశ హాలులో మిర్యాలగూడ మున్సిపాలిటీ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి సమీక్షించారు.
చెత్త పేరుకు పోవడం వల్ల దోమలు, కుక్కల బెడద, వ్యాధులు పెరుగుతాయని, తద్వారా ప్రజలు ఇబ్బందులు పడతారని, అందువల్ల మున్సిపల్ అధికారులు ,సిబ్బంది పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. శానిటేషన్ సిబ్బంది తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని, సేకరించిన చేతను డంపింగ్ యార్డ్ కు తీసుకెళ్లి బయో మైనింగ్ చేయాలని ఆదేశించారు. జవాన్లు, సిబ్బంది ఇకపై ఆన్లైన్ అటెండెన్స్ ఇవ్వాలని, ఎవరు విధులకు హాజరు కాకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని, మున్సిపల్ కమిషనర్,వార్డు అధికారులు తప్పనిసరిగా వార్డులలో పర్యటించాలని,ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చూడాలని ,ప్రత్యేకించి మున్సిపాలిటీలో చెత్త వేసే ప్రదేశాలు ఉండరాదని, ప్రస్తుతం 30 చోట్ల చెత్త వేసే ప్రదేశాలను గుర్తించినట్లు అధికారులు తెలుపగా, వాటి సంఖ్యను పూర్తిగా తగ్గించి అక్టోబర్ 2 నాటికి చెత్త రహిత మున్సిపాలిటీగా చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాలు చికెన్ షాపులు, చేపల మార్కెట్ ద్వారా వచ్చే వ్యర్ధాలను బయట వేయకుండా, వ్యర్ధాలన్నింటిని క్రమ పద్ధతిలో డిస్పోజ్ చేసేందుకు మున్సిపల్ కమిషనర్ చర్య తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా చెత్త బయట వేస్తే పెనాల్టీ విధించాలని, చెత్తరహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో శానిటేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇందుకు మున్సిపల్ ఆటోల ద్వారా ప్రచారం నిర్వహించాలని చెప్పారు. ప్రతిరోజు మున్సిపాలిటీ పరిధిలో ఫాగింగ్ నిర్వహించాలని, ఈ శుక్రవారం నుండి “ఫ్రైడే డ్రైడే” చేపట్టాలని ఆదేశించారు. అక్టోబర్ 2 నుండి ప్రతి ఇంటి నుండి చెత్తను నాలుగు రకాలుగా సేకరించేందుకు చెత్త బాక్సులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మున్సిపాలిటీలో ప్లాస్టిక్ వాడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలకు హాని కలిగించే ప్లాస్టిక్ ను వినియోగించవద్దని చెప్పాలని, బయోడిగ్రేడబుల్ కవర్లు లేదా బట్ట సంచులు వాడేలా షాపులో యజమానులకు సూచించాలని, ఒకవేళ ఒకటికి రెండు సార్లు చెప్పినప్పటికీ వినకపోతే సదరు షాపులను సీజ్ చేయాలని ఆదేశించారు.
మిర్యాలగూడ మున్సిపాలిటీ లో పైలెట్ పద్ధతిలో నిర్వహిస్తున్న” నక్ష “కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, ముఖ్యంగా వారంలోపు ఆర్ ఓ ఆర్ ఎంట్రీలను పెంచాలని, ఏ రోజుకు ఆరోజు డేటా ఎంట్రీ ని పూర్తి చేయాలని, భూములకు సంబంధించి సర్వే మాత్రం మిగిలి పోయి ఉన్నందున సర్వే నిర్వహించే విషయాన్ని ముందే సంబంధిత వ్యక్తులకు తెలియజేయాలని చెప్పారు.
కాగా నక్ష సర్వేలో భాగంగా 32 వార్డులకు గాను ఇప్పటివరకు 25 వార్డులు పూర్తి చేయడం జరిగిందని, 356 బ్లాకులకు గాను 332 పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు. 1225 ఎకరాల సర్వే చేయాల్సి ఉన్నట్లు తెలిపారు. ప్రతిరోజు 30 డేటా ఎంట్రీ పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు .
మున్సిపాలిటీలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ప్రతి ఇంటికి, ప్రభుత్వ సంస్థలకు ,అన్నిచోట్ల తాగు నీరు వచ్చేలా వార్డు అధికారులు
చూడాలని, ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ఇండ్ల సమాచారం వార్డు అధికారుల దగ్గర ఉండాలని, ఇకపై వార్డు అధికారులతో వార్డు ప్రొఫైల్ లేకుంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అమృత్ కింద చేపట్టిన తాగునీటి ఓహెచ్ఎస్ఆర్లను డిసెంబర్ లోపు పూర్తి చేయాల్సిందిగా పబ్లిక్ హెల్త్ సూపరింటిండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఏజెన్సీలను ఆదేశించారు .
మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయమైన ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, 16 కోట్ల రూపాయలకు గాను కేవలం 20 శాతం మాత్రమే వసూలు చేయడం జరిగిందని తెలిపారు. వార్డు అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పన్నును వసూలు చేయాలన్నారు.
ప్రస్తుతం వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నందున వనమహోత్సవం కింద మొక్కలు నాటాలని, ఈనెల 20 శాతం లక్ష్యాలు సాధించేందుకు దృష్టి సారించాలన్నారు.
మున్సిపాలిటీలో చేపట్టిన రోడ్లు ,సెంట్రల్ మీడియన్, ఫ్లైఓవర్ సుందరీకరణ పై కలెక్టర్ సమీక్షించారు .
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో చేపట్టిన తాగునీటి పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలని అన్నారు. అలాగే గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో కామాటీలను, జవాన్లను తీసుకోవడం జరిగిందని, ప్రస్తుతం వారిలో కొంతమందికి వయస్సు మళ్ళీనందున కమాటిల ఏర్పాట్లపై చర్య తీసుకోవాలని కలెక్టర్ తో కోరారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో హాస్పిటల్ ,బస్టాండ్, కూరగాయల మార్కెట్, వైకుంఠధామం, తదితర ప్రదేశాల వద్ద ప్రజలకు ఇబ్బంది కలగకుండా పారిశుద్ధ్యన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. శానిటేషన్ పైనే ప్రజల ఆరోగ్యం ఆధారపడి ఉందని , ఇందుకు ప్రజాప్రతినిధులుగా తాము కూడా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు .అధికారులు మున్సిపల్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రతి రోజు తాగునీరు, విద్యుత్ పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మున్సిపల్ పరిధిలోని ఎన్ఎస్పి క్యాంపు, చింతపల్లి, ఆడవిదేవులపల్లిలో స్థలాలు ఉన్నందున సబ్ స్టేషన్ ల మంజూరు కు సహకరించాలని జిల్లా కలెక్టర్ తో కోరారు. అలాగే విద్యుత్తు సమస్య లేకుండా విద్యుత్ స్తంభాలు వైర్ల కోటా మిర్యాలగూడ కు రావడంలేదని, ఈ విషయంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఆదాయ మార్గాన్ని పెంచేలా మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు ప్రత్యేకించి మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులకు సహకరించాలని చెప్పారు. మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలోని విస్తరించి ఉన్న జాతీయ రహదారిపై నాలుగు చోట్ల ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉందని, అక్కడ ప్రమాదాలు జరగకుండా వై జంక్షన్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. పట్టణం మొత్తం రహదారులపై తోపుడుబండ్లు, చిరు వ్యాపారాలు చేసుకునేవారు స్థలాలను ఆక్రమించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఈ విషయంపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తో కోరారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు ప్రాంతీయ వైద్యశాలలో వికలాంగుల ప్రత్యేక వైకల్య నిర్ధారణ కేంద్రాన్ని ,ఊయల కేంద్రాన్ని ,డేటా ఎంట్రీ కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రికి వివిధ రోగాలతో వచ్చిన పేషంట్లతో మాట్లాడుతూ వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ ,వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, జెడ్పి సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాహుల్ ,డిసిహెచ్ఎస్ డాక్టర్ మాతృ, ఆర్డిఓ రమణారెడ్డి ,డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు



