ఖాళీ డాక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి అవసరమైన సదుపాయాలు కల్పించాలి పాలడుగు ప్రభావతి, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి
ఖాళీ డాక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి అవసరమైన సదుపాయాలు కల్పించాలి పాలడుగు ప్రభావతి, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
ప్రజాలహరి మిర్యాలగూడ; (హరి ప్రసాద్ చీదళ్ళ) పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడం అత్యవసరమని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేసి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ఐద్వా ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన సర్వే అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రజలకు అందాల్సిన వైద్య సేవలు అనేక చోట్ల సిబ్బంది కొరత, మందుల కొరత, పరికరాల లేమి కారణంగా పూర్తిస్థాయిలో అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ తగిన సంఖ్యలో వైద్యులు లేకపోవడంతో రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. అవసరమైన పరీక్షల కోసం ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, దీంతో పేద ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు.గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు మరింత బలోపేతం చేయాలని, అత్యవసర విభాగాలు 24 గంటలు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని రకాల మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని, రక్తపరీక్షలు, స్కానింగ్, ఎక్స్రే, ఇతర నిర్ధారణ పరీక్షల కోసం ఆధునిక పరికరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, రోగులకు పడకలు, ఫ్యాన్లు, తగినంత విద్యుత్, వేచివుండే షెడ్లు, తల్లిపాలు ఇచ్చే గదులు వంటి ప్రాథమిక సౌకర్యాలు మెరుగుపరచాలని అన్నారు. రోగులు, వారి సహాయకులతో గౌరవప్రదంగా వ్యవహరించేలా సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. ఐద్వా ప్రధాన డిమాండ్లు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అవసరమైన మందులు, వైద్య పరికరాలు నిరంతరం అందుబాటులో ఉంచాలి. అన్ని నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా నిర్వహించాలి.ఆసుపత్రుల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, పడకలు తదితర సౌకర్యాలు మెరుగుపరచాలి.గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు బలోపేతం చేయాలి.పేద ప్రజలకు ఉచిత, నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, లేకపోతే ప్రజలను సమీకరించి ఐద్వా ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని పాలడుగు ప్రభావతి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వ జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి జిల్లా సహాయ కార్యదర్శి పాదూరి గోవర్ధన అరుణ సైదమ్మ జిల్లా కమిటీ సభ్యు రాళ్లు మనుల అరుణ కొంపెల్లి కౌసల్య. ఐద్వా సభ్యు రాళ్లు సూదిని కళమ్మ డి లలిత పాల్గొన్నారు



