సూర్యాపేట ఎస్వీఆర్ లో ఠాగూర్ సినిమా రిపీట్
సూర్యాపేట ఎస్వీఆర్ లో ఠాగూర్ సినిమా రిపీట్
కళ్ళు తిరుగుతున్నాయంటూ వచ్చిన వ్యక్తికి స్టంట్ వేసి ప్రాణాలు తీసిన వైనం చనిపోయిన విషయాన్ని కూడా కుటుంబ సభ్యులకు చెప్పకుండా మృతదేహాన్ని గ్రామానికి పంపిన ఆసుపత్రి డాక్టర్లు
ప్రజాలహరి మిర్యాలగూడ; సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీఆర్ ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా రిపీట్ అయింది. నకిరేకల్ గ్రామానికి చెందిన పగిడిమర్రి మధుసూదన శర్మ కళ్ళు తిరుగుతున్నాయని తెలపడంతో కుమార్తె శ్రీవల్లి మంగళవారం ఆసుపత్రికి తీసుకొని వచ్చింది ఆయనను పరిశీలించిన వైద్యులు స్టంట్ లు వేయాలని చెబుతూ ఆరోగ్యశ్రీకి దరఖాస్తు చేసుకోవాలని చెప్పగా కుటుంబ సభ్యులు ఆరోగ్యశ్రీ కి దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం బుధవారం ఒక స్టంట్ వేయగా రోగి సహకరించకపోవడంతో తిరిగి మరో స్టంట్ ను కూడా వేయడం జరిగింది. బుధవారం మూడున్నర గంటల సమయంలో రోగి చనిపోతే కనీసం కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆసుపత్రి ఆంబులెన్స్ లో నకిరేకల్ పంపించడం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు గురువారం ఎస్విఆర్ ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. మా నాన్న మధ్యాహ్నం మూడున్నర గంటలకే చనిపోతే 5 గంటల వరకు మాకు చెప్పకుండా ఆ మందులు ఈ మందులు అంటూ తెప్పించారని అన్నారు. కాగా తమకు చనిపోయిన విషయాన్ని చెప్పకుండా తాము ఆసుపత్రిలో కట్టిన 80వేల రూపాయలు ఇచ్చి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు కిడ్నీ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్లు ఎలా చేస్తారని మా నాన్నకు ఆపరేషన్ చేసిన వైద్యురాలు లక్ష్మి శాలిని పేరు బోర్డుపై ఎక్కడ కూడా లేదన్నారు. మా నాన్న ప్రాణాన్ని తిరిగి ఇవ్వాలని లేదా మాకు నష్టపరిహారం చెల్లించాలని ఉన్నత అధికారులు స్పందించి ఆసుపత్రిని మూసివేయించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.



