రాజ్యాంగం స్ఫూర్తితోనే పని చేస్తా; రంగనాథ్ భావోద్వేగ లేఖ విడుదల
ప్రజాలహరి మిర్యాలగూడ (హరిప్రసాద్ చీదళ్ళ);- రాజ్యాంగ స్ఫూర్తితోనే పని చేస్తున్నాను
– చెరువులు, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నాను
– శ్రీ ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్
– నేను ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్‌గా రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులను రక్షించే బాధ్యతను నిర్వర్తించాను. మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ రూ.1.50 లక్షల కోట్లు (17 బిలియన్ డాలర్లు). ఆరు చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాం. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. బడా బాబులు ఆక్రమించిన వందలాది చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను హైడ్రా ఈ రెండేళ్లలో తిరిగి స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించింది. నిజాయితీగా, నిర్భయంగా, నిబద్ధతతో నిజం వైపు నిలబడి పని చేస్తున్నందుకే హైడ్రాకు ధైర్యం ఉంది. ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు. లోతుకుంట భూమి విషయంలో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించింది.



