ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
* మధ్యాహ్న భోజన మెనూ చార్జీలు పెంచాలి. ప్రజాలహరి మిర్యాలగూడ; వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు రెముడాల పరశురాములు, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్. సీతారాములు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, శిథిలావస్థకు చేరిన భవనాలకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు రేముడాల పరశురాములు, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్. సీతారాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థులకు ఇప్పటివరకు స్కూల్ యూనిఫామ్లు అందకపోవడం బాధాకరమన్నారు. అలాగే, పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి మధ్యాహ్న భోజనం కోసం కేటాయిస్తున్న మొత్తం సరిపోవడం లేదని పేర్కొన్నారు. బియ్యం, వంట నూనె, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే మెనూ చార్జీలను పెంచి, నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ గదులు ఉన్నప్పటికీ కంప్యూటర్ ఉపాధ్యాయులు లేకపోవడం, ఉన్న కంప్యూటర్లు మరమ్మతులకు గురై నిరుపయోగంగా మారడం వంటి సమస్యలు ఉన్నాయని వారు అన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రభుత్వ పాఠశాలలకు కూడా ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల్లో తక్షణమే మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి, విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం, కల్లు గీత కార్మిక సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



