పూర్వ విద్యార్థి సేవాభావం: విద్యార్థులకు క్రీడా దుస్తుల వితరణ
ప్రజాలహరి – అనుముల (హాలియా): అనుముల-హాలియా మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాచారం విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుతం హైదరాబాద్ లో సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గ్రామవాసి కుందూరు వెంకట్ రెడ్డి తన సొంత ఖర్చులతో క్రీడా దుస్తులను అందజేశారు. గతంలో ఇదే పాఠశాలలో విద్యనభ్యసించిన వెంకట్ రెడ్డి గత సంవత్సరం కూడా విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు కబడ్డీ క్రీడా దుస్తులు, షూలను బహుకరించారు. తాజాగా మరోసారి విద్యార్థులకు క్రీడా దుస్తులను అందించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ యువత ఆయనను అభినందించారు.ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే సెల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల వినియోగానికి దూరంగా ఉండి, చదువుపై పూర్తి దృష్టి సారించాలని కోరారు. క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసమే ఉన్నత స్థాయికి ఎదగడానికి బలమైన పునాది అని పేర్కొన్నారు.ప్రస్తుతం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా గంజాయి, మాదకద్రవ్యాలు, మద్యం వంటి మత్తు పదార్థాల ప్రభావం చేరుతున్న నేపథ్యంలో, విద్యార్థులు, యువత వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు.
తానూ ఇదే పాఠశాలలో 1998-99 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేశానని వెంకట్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. తన బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాల అభివృద్ధికి భవిష్యత్తులో మరింత కృషి చేస్తానని తెలిపారు. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. నాగిరెడ్డి మాట్లాడుతూ, కుందూరు వెంకట్ రెడ్డి అందిస్తున్న సేవలను అభినందించారు. తాను చదువుకున్న పాఠశాలను గుర్తు పెట్టుకొని విద్యార్థుల కోసం తన వంతు సహాయం అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు వెంకట్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, భవిష్యత్తులో తమ గ్రామానికి, పాఠశాలకు సేవలందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, చల్లా వెంకట్ రెడ్డి, త్రిమూర్తి, వెంకటేశ్వరరావు, లక్ష్మయ్య, ప్రతాప్ రెడ్డి, రహమాన్, నారాయణ రెడ్డి తదితరులతో పాటు గ్రామ యువత పాల్గొన్నారు.



