శుభకార్యాల పేరుతో హిజ్రాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే, బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు అట్టి వారిపైన చట్టపరమైన చర్యలు తప్పవు మిర్యాలగూడ పోలీసుల హెచ్చరిక.
ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ పట్టణ పరిధిలో గృహప్రవేశాలు, వివాహాలు, పుట్టినరోజు వేడుకలు, ఫంక్షన్లు మరియు ఇతర శుభకార్యాలు నిర్వహించుకునే ప్రజలను కొంతమంది హిజ్రాలు డబ్బులు ఇవ్వాలని బలవంతపెట్టి, ఇవ్వకపోతే ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో, మిర్యాలగూడ పోలీసుల ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని హిజ్రాలకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించవద్దని స్పష్టమైన హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మిర్యాలగూడ Dy. సూపర్ ఇంటెండెంట్, శ్రీ G.రవి, మిర్యాలగూడ-II టౌన్ ఇన్స్పెక్టర్ J.సోమనర్సయ్య, మిర్యాలగూడ రూరల్ సర్కిల్ CI PND ప్రసాద్, మిర్యాలగూడ-I టౌన్ ఇన్స్పెక్టర్ M.నాగభూషణ రావు లు మాట్లాడుతూ, ప్రజలు తమ ఇళ్లలో గృహప్రవేశాలు, వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకునే సమయంలో ఎవరైనా స్వచ్ఛందంగా తమకు తోచిన విధంగా డబ్బులు లేదా ఇతర సహాయం అందిస్తే దానిని స్వీకరించవచ్చని, అయితే డబ్బులు ఇవ్వాలని బలవంతం చేయడం, డబ్బులు ఇవ్వకపోతే బెదిరించడం, అసభ్యంగా ప్రవర్తించడం, దుర్భాషలాడడం, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం, శుభకార్యాలకు వచ్చిన బంధువులు మరియు అతిథులను ఇబ్బందులకు గురిచేయడం లేదా కార్యక్రమానికి ఆటంకం కలిగించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఎవరి నుండి అయినా బలవంతంగా డబ్బులు వసూలు చేయడం లేదా బెదిరింపులకు పాల్పడటం చట్టవిరుద్ధమని, ప్రజల ప్రశాంతతకు, స్వేచ్ఛకు మరియు భద్రతకు భంగం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే, వారి పై ఫిర్యాదు ఆధారంగా సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి, తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. మిర్యాలగూడ ఏరియాలోని హిజ్రాలు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, శుభకార్యాలు నిర్వహించుకుంటున్న కుటుంబాల వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వాలని బలవంతం చేయకూడదని, ఎటువంటి బెదిరింపులు, దుర్భాషలు లేదా అసభ్య ప్రవర్తనకు పాల్పడకూడదని పోలీసులు సూచించారు. ఇకపై ఇలాంటి ఫిర్యాదులు అందినట్లయితే కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా, సంఘటన తీవ్రతను బట్టి సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఇటువంటి సంఘటనలకు గురైనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని, సంఘటన జరిగిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు కు గాని లేదా 112 కి కాల్ చేయి గాని సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే సంఘటనపై విచారణ జరిపి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో శాంతిభద్రతలను కాపాడటం, ప్రజలకు సురక్షితమైన మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎటువంటి బలవంతపు వసూళ్లు, బెదిరింపులు లేదా అసాంఘిక చర్యలను ఉపేక్షించబోమని పోలీసు అధికారులు మరోసారి స్పష్టం చేశారు.ప్రజలు పోలీసులకు సహకరించి, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే సమాచారం అందించాలని కోరారు.



