ధ్యానం మనలో ప్రేమ, సహానుభూతి, సామరస్యాన్ని పెంపొందిస్తుంది: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

ప్రజాలహరి మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలో మూడు రోజులుగా నిర్వహించిన ధ్యానోత్సవ ముగింపు కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ధ్యానోత్సవానికి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ధ్యానం ద్వారా మనలో ప్రేమ, సహానుభూతి, సామరస్యంతో పాటు సానుకూల దృక్పథం పెంపొందుతాయని అన్నారు. జీవితంలో జటిలమైన సమస్య ఎదురైనప్పుడు ఒక నిమిషం మన అంతరంగంతో అనుసంధానమై ప్రశాంతంగా ఆలోచిస్తే, ఆ సమస్యకు పరిష్కారం వైపు వెళ్లే మార్గం కనిపిస్తుందని తన వ్యక్తిగత అనుభవాన్ని ఎమ్మెల్యే పంచుకున్నారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను సానుకూల దృక్పథంతో స్వీకరిస్తే, అవే మన వ్యక్తిత్వ వికాసానికి, జీవితంలో మరింతగా ఎదగడానికి మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పారు. ప్రతి పరిస్థితిలో మనమే నెగ్గాలనే భావనకు బదులుగా, సమస్య లోతును అర్థం చేసుకుని పరిస్థితికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడంలో ధ్యానం ఎంతో సహాయపడుతుందని పేర్కొన్నారు. తాను కన్హా శాంతివనం సందర్శించినప్పుడు అక్కడ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను స్వయంగా వీక్షించి ఎంతో ప్రేరణ పొందానని బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. ధ్యానం వ్యక్తిగత ప్రశాంతతతో పాటు సమాజంలో సానుకూలత, ప్రేమ, సహానుభూతి, సామరస్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని ఆయన అన్నారు.

You May Have Missed