వ్యవసాయానికి 18 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలి: జూలకంటి రంగారెడ్డి యూరియా అందించాలి, యాప్ పునరుద్ధరించాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుల డిమాండ్
ప్రజాలహరి – మిర్యాలగూడ: రాష్ట్రంలో బోర్లు, బావుల కింద ఖరీఫ్ సీజన్ లో వేసిన వరి పైర్లు విద్యుత్ అందక ఎండిపోతున్నాయని, వాటిని కాపాడేందుకు ప్రభుత్వం నిరంతరంగా 18 గంటల విద్యుత్ సరఫరా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులకు యూరియా ఎరువులు అందించాలని, దానికి సంబంధించిన యాప్ ను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ఖరీఫ్ సీజన్ అయిపోయిందనే ఉద్దేశంతో ప్రభుత్వం యూరియా అవసరం లేదని భావించి యాప్ ను నిలిపివేసిందని, దాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
రైతులు ఎకరానికి రూ.30 వేల నుండి 40 వేల వరకు పెట్టుబడి పెట్టి ఖరీఫ్ లో వరిని సాగు చేస్తున్నారని, ప్రస్తుతం పంట పొట్ట దశకు చేరుకుందని, ఈ సమయంలో నీరు ఎంతో అవసరమని అన్నారు. ప్రభుత్వం పేరుకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతున్నా, వాస్తవానికి 12 గంటలు కూడా రావడం లేదని ఇది వాస్తవ పరిస్థితి అని తెలిపారు.
అరకొర కరెంటుతో మొదటి మడికే నీళ్లు అందుతున్నాయని, మిగిలిన పొలమంతా ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దశలో కనీసం 18 గంటలైనా నిరంతర విద్యుత్ ఇస్తే రైతులు కొంతలో కొంత అప్పుల బారి నుండి బయటపడతారని సూచించారు.
వర్షాభావ పరిస్థితుల వల్ల బావుల్లో నీరు లేకపోయినా, ఉన్న బావుల కింద సాగయ్యే పంటలకు విద్యుత్ సరఫరా ఆటంకంగా మారిందని, అందుకే ప్రభుత్వం స్పందించి రైతులను కాపాడాలని కోరారు.
అదేవిధంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 537.9 అడుగుల వరకు నీరు ఉన్నందున, ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలను నింపాలని, తాగునీటి అవసరాలను కూడా తీర్చి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు రవి నాయక్, వినోద్ నాయక్, సీపీఎం పట్టణ కార్యదర్శి భావండ్ల పాండు, నాయకులు రామ్మూర్తి, టాప్రా నాయకులు నూకల జగదీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.



