కార్మిక–కర్షక పోరాటాల స్ఫూర్తితో రైతు మహాసభలను విజయవంతం చేయాలి

ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడలో కార్మికులతో సమావేశంలో ఏఐకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపుమిర్యాలగూడ: వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లాలో నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న అఖిల భారత 36వ రైతు మహాసభలను విజయవంతం చేయడానికి కార్మికులు, కర్షకులు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని ఏఐకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.మహాసభల విజయవంతం కోసం మిర్యాలగూడలో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దేశ రైతాంగ ఉద్యమ చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉందన్నారు. నల్లగొండ గడ్డ అనేక రైతాంగ పోరాటాలకు స్ఫూర్తినిచ్చిందని, అదే పోరాట స్ఫూర్తితో ప్రస్తుత రైతాంగ సమస్యలపై ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు.దేశంలో రైతులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించడంతో పాటు, రైతాంగ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకునేందుకు అఖిల భారత రైతు మహాసభలు వేదికగా నిలుస్తాయని తెలిపారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కార్మిక–కర్షక ఐక్యతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల సమస్యలు కేవలం రైతులకే పరిమితమైనవి కాదని, వ్యవసాయంపై ఆధారపడిన కోట్లాది మంది ప్రజల జీవనంతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాసంఘాలు ఐక్యంగా ముందుకు సాగితేనే ప్రజా సమస్యల పరిష్కారానికి బలమైన ఉద్యమాలను నిర్మించగలమన్నారు.నల్లగొండలో జరుగుతున్న ఈ జాతీయ మహాసభలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతు నాయకులు, ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో మహాసభల విజయవంతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని జూలకంటి రంగారెడ్డి కోరారు.మహాసభల ప్రచారాన్ని గ్రామగ్రామాన, కార్మిక ప్రాంతాల్లో విస్తృతంగా నిర్వహించాలని, కార్మికులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహాసభల విజయవంతం కోసం విరాళాలు, ప్రచారం, ఇతర కార్యక్రమాల్లో కార్మికులు మరియు ప్రజలు సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి రవి నాయక్, రైల్వే హమాలి యూనియన్ నాయకులు నంద్యాల వేణుధర్ రెడ్డి, బధ్యానాయక్, ధనావత్ భాగ్య నాయక్, బాణావతి, రెడ్య నాయక్,అజమీరా హుష్యా, బాలు,తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed