నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు. జైవీర్ రెడ్డి ఆదేశాల మేరకు హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రివ్యూ మీటింగ్
ప్రజాలహరి హాలియా;తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు హాలియా మున్సిపల్ కమిషనర్ కె. రవీందర్ రెడ్డి అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ కార్యక్రమం ద్వారా నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. లబ్ధిదారులు తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకొని ఇంటి పై కప్పు మీద పడిన వర్షపు నీటిని మళ్ళించి ప్రస్తుత వర్షాభావ ఎల్ నినో లాంటి పరిస్థితుల నుండి భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని కమిషనర్ సూచించారు. చెల్లింపులకు (Payment), ఆధార్ సీడింగ్ కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే హౌసింగ్ శాఖ ఏఈ, డీఈ అధికారులతో చర్చించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మున్సిపల్ చైర్మన్ శ్రీ చింతల చంద్ర రెడ్డి మాట్లాడుతూ హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు 232 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయటం జరిగింది.లబ్ధిదారులు వీటిని త్వరితగతిన పూర్తి చేసినట్లయితే మున్సిపాలిటీ పరిధిలో గుడిసెలు ఉన్నవారికి మరొక 60 ఇండ్లను కొత్తగా మంజూరు చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు, మరియు లబ్ధిదారులు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఇళ్ల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు అనవసరంగా ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టుకొని ఇబ్బందులకు గురి కావద్దని గుర్తు చేశారు. హాలియా మున్సిపాలిటీని గుడిసెలు లేని మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే. రవీందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్, హౌసింగ్ శాఖ ఏఈ, మున్సిపల్ కౌన్సిలర్లు, కౌన్సిలర్ సలహాదారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, మున్సిపల్ వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.



