ప్రత్యామ్నాయ పంటలు, నిల్వ పంటల యాజమాన్యంపై రైతులకు అవగాహన
ప్రజాలహరి మిర్యాలగూడ; మిర్యాలగూడ మండలం కొత్తగూడెం రైతువేదికలో రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా కాంటింజెన్సీ ప్లాన్, ప్రత్యామ్నాయ పంటల సాగు, నిల్వ పంటల యాజమాన్య పద్ధతులు మరియు గతంలో నెలకొన్న పొడి వాతావరణ పరిస్థితుల నుంచి పంటల పునరుద్ధరణకు నానో యూరియా వినియోగం వంటి అంశాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యం. రుషేంద్రమని వ్యవసాయ అధికారి, మిర్యాలగూడ మరియు పార్వతి వ్యవసాయ విస్తరణ అధికారి, గూడూరు పాల్గొని రైతులకు పలు సూచనలు అందించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవడం, ఇప్పటికే సాగులో ఉన్న పంటల్లో తేమను సంరక్షిస్తూ సమగ్ర పంట యాజమాన్య చర్యలు చేపట్టడం, పంటల ప్రస్తుత పరిస్థితిని బట్టి అవసరమైన పోషక యాజమాన్య చర్యలు తీసుకోవడం గురించి వివరించారు. అలాగే, నిల్వ పంటల్లో పంట ఆరోగ్యం మరియు ఎదుగుదలను పరిశీలిస్తూ, వ్యవసాయ శాఖ సూచనల మేరకు నానో యూరియా వినియోగం ద్వారా పంటల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ పంటల నిర్వహణ చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచించారు.



