వర్కింగ్ జర్నలిస్టులందరికీ క్యాష్ లెస్ హెల్త్ కార్డులు అమలు చేయాలి: టీయూడబ్ల్యూజే (హెచ్ – 143) 

ప్రజాలహరి మిర్యాలగూడ;తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ఆసుపత్రుల్లోనూ క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించేలా హెల్త్ కార్డులు అమలు చేయాలని టీయూడబ్ల్యూజే (హెచ్ – 143) స్టేట్ సెక్రటేరియెట్ మెంబర్ అన్నెబోయిన మట్టయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే (హెచ్-143) రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మెన్ అల్లం నారాయణ పిలుపు మేరకు పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. మొదటగా మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డులోగల జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా టీయూడబ్ల్యూజే (హెచ్-143) నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. జర్నలిస్టుల హక్కుల సాధనతోపాటు ఆయా కుటుంబాల సంక్షేమానికి యూనియన్ అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. గతంలో హెల్త్ కార్డుల సాధన కోసం పోరాటం చేయడంతోపాటు మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం, వారి పిల్లల విద్యకు చేయూతనివ్వడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. కరోనా మహమ్మారి సమయంలోనూ చైర్మెన్ అల్లం నారాయణ గారి నాయకత్వంలో కరోనా బారినపడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం జర్నలిస్టుల హెల్త్ కార్డులు కొన్ని ఆసుపత్రులకే పరిమితం కావడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు చెల్లుబాటయ్యేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన పోస్టు కార్డుల ఉద్యమంలో ప్రతి జర్నలిస్టు భాగస్వామి కావాలని కోరారు. అనంతరం ర్యాలీగా బయలుదేరిన యూనియన్ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి అడ్రెస్: సీఎంఓ కార్యాలయం, 6వ అంతస్తు, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, హైదరాబాద్ -500022, అనే చిరునామాకు స్థానిక ఎన్.ఎస్.పి. క్యాంపులోని పోస్ట్ బాక్స్ లో పోస్ట్ కార్డులను వేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (హెచ్-143) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మల్లె నాగిరెడ్డి, జిల్లా కార్యదర్శి విరగని లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు బొంగరాల మట్టయ్య, నియోజకవర్గ అధ్యక్షులు జంగా లక్ష్మణ్, నాయకులు మంద లక్ష్మణ్, కందుకూరి సుదర్శన్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు బంటు విటి, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

Previous post

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి  ఆర్డీవో కార్యాలయం ఎదుట జర్నలిస్టుల రాస్తారోకో  ఆర్డీవోకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గాంధీ విగ్రహాలకు వినతిపత్రం 

Next post

ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (AVOPA – ఆవోపా), మిర్యాలగూడ ఆధ్వర్యంలో 

You May Have Missed