కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన సందర్భంగా నెరవేర్చని ఆరు గ్యారెంటీలు 420 హామీలనుద్దేశించి హాలియాలో భారీ ర్యాలీ
ప్రజాలహరి హాలియా;రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తి అయిన సందర్భంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరుగారంటీలు 420 హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు హాలియాలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా 1000 రోజుల్లో అమలు చేయలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేయడంతో పాటు 420 హామీలను అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 1000 రోజులు పూర్తి అయినప్పటికీ గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయలేదని విమర్శించారు.ఈ ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటినాయే తప్ప చేతలు గడప దాటడం లేదని అన్నారు. దాచుకోవటం దోచుకోవటమే కాంగ్రెస్ పార్టీ నాయకులు నైజం అయిపోయిందని తెలిపారు. ఈ వెయ్యి రోజుల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్క వర్గాన్ని కూడా సంతృప్తి పరచలేకపోయిందని తెలిపారు. విద్యార్థులు యువకులు నిరుద్యోగులు మహిళలు రైతు కూలీలు ఇలా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి ఆ పార్టీకి ఓటేసి మోసపోయామని ఇప్పుడు ప్రజలు గ్రహించారని తెలిపారు. రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని తెలిపారు ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో సబ్బండవర్గాల సంక్షేమ లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేయనున్నదని తెలిపారు.రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను గ్రామ గ్రామాన ప్రజలకు వివరించాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



